*జననేత్రం న్యూస్ స్టేట్. జులై 13*//;విమర్శల పేరిట హద్దులు దాటి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న నేటి తరం రాజకీయం, ఇది ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరం మాత్రమే కాదు ప్రజల నమ్మకాన్ని కూడా కోల్పోయే అంశం..
*ప్రజాస్వామ్యంలో విమర్శలు అవసరం కానీ అవి వాస్తవాలపై చేయాలి*
*వాదనలు అవసరం… కానీ* *అవి విలువలతో సాగాలి !**
*పోటీ అవసరం… కానీ అది పరస్పర గౌరవంతో జరగాలి!**
అయితే ఈ మధ్యకాలంలో మన రాజకీయ పరిస్థితులు చూస్తే… ఇవన్నీ దూరమైపోయినట్టుగా అనిపిస్తుంది. చర్చలు అభివృద్ధి దిశగా కాక, వ్యక్తిగత దూషణల దిశగా పరిగెడుతున్నాయి.
ప్రజాస్వామ్య వేదికలు మాటల యుద్ధ రంగాలుగా మారిపోతున్నాయి. ఇది అత్యంత ఆందోళనకరమైన పరిణామం!
*రాజకీయ వేదికలు – అభివృద్ధి చర్చలకు కాదు, వ్యక్తిగత దూషణలకు కేంద్రాలుగా?*
రాజకీయ నాయకుడు మాట్లాడే వేదిక అభివృద్ధిని చర్చించాలి, సమస్యలకు పరిష్కారాలను సూచించాలి.
కానీ ఈ రోజు వాస్తవ పరిస్థితి ఏమిటంటే –
వేదికలు సమస్యలపై కాదు, ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై దాడులుగా మారాయి.
అవమానకరమైన పదజాలం, కుటుంబాల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు, అసభ్యమైన విమర్శలు… ఇవే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ప్రజలు అభివృద్ధిని ఆశిస్తూ ఓటు వేస్తే… నాయకులు విమర్శల అడ్డదారిలో వెళుతున్నారు
*ఏ పక్షమైనా అదే తీరు!*
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర చాలా కీలకం.
ప్రభుత్వం తప్పులు చేస్తే అవి గుర్తించాలి, ప్రజల తరపున ప్రశ్నించాలి.
అలాగే అధికార పక్షం బాధ్యతాయుతంగా స్పందించాలి.
కానీ ఇక్కడ చూస్తున్నది మాత్రం హద్దులు దాటిన మాటలు, వ్యక్తిగత విమర్శలు, అసభ్య పదజాలం.
ఇది ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తోంది.
విపక్షం విమర్శించాల్సిన వేదిక అసభ్య ప్రదర్శనలకు కేంద్రంగా మారుతోంది.
అధికార పక్షం ప్రతిస్పందనలో మర్యాద కనిపించడంలేదు.
ఈ రెండు పక్షాల తీరూ ప్రజాస్వామ్య పునాది అయిన విలువలను ధ్వంసం చేస్తోంది.
**ఓటు కోసం తిట్లు – అధికారం నిలుపు కోవడానికి ఇక్కట్లు*
ఎన్నికలు అంటే అభివృద్ధిపై పోటీ కావాలి.
సామాజిక సమస్యలపై ఎవరు మంచి ఆలోచనలు పంచుకుంటున్నారు, ఎవరు బలమైన విధానాలతో ముందుకొస్తున్నారు అన్నదానిపై ప్రజలు ఓటు వేయాలి.
కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటి?
ఓటు కోసం తిట్లుపోటీ.
ఓటు కోసం వ్యక్తిగత దూషణలు.
ఓటు కోసం అసత్య ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు. ఓటు కోసం అధికారం కోసం వ్యక్తిత్వ హాననాలు
ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం మాత్రమే కాదు, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడం కూడా
*ప్రజలు అన్నీ గమనిస్తున్నారు*
ఈరోజుల్లో ప్రజలు చాలా చైతన్యవంతంగా మారారు.
వారు గమనిస్తున్నారు – ఎవరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు?
ఎవరు వాస్తవాలను చెబుతున్నారు? ఎవరు వ్యక్తిగత విమర్శలకే పరిమితమవుతున్నారు అనేది,
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పే స్థాయికి చేరుకున్నారు.
ఇది రాజకీయ నాయకులకు స్పష్టమైన హెచ్చరిక.
ఇకనైనా వాళ్ల మాటల తీరుపై జాగ్రత్త వహించాల్సిన సమయం ఆసన్నమైంది.
*విలువలు లేని రాజకీయం అంటే ఏమిటి?*
అభివృద్ధి ప్రస్తావన కాకుండా వ్యక్తిగత విమర్శలపై దృష్టిపెట్టడం
ప్రజల సమస్యలు మర్చిపోయి, ప్రత్యర్థుల వ్యక్తిత్వంపై దాడులు చేయడం
రాజకీయ విమర్శలు మర్యాద, సంస్కారం లేకుండా ఉండడం
అసభ్య పదజాలంతో విమర్శలు చేసి ప్రజల దృష్టిని మళ్లించడం
నైతికతను పక్కన పెట్టి అధికారాన్ని మాత్రంగా లక్ష్యంగా పెట్టుకోవడం
ఈ విధమైన తీరే ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మోగిస్తుంది.
పౌరుల విశ్వాసాన్ని కోల్పోయిన రాజకీయ వ్యవస్థ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు
మాటల విలువ తెలుసుకోని నాయకత్వం – ప్రజాస్వామ్య పతనానికి సంకేతం
ఒక నాయకుడి మాటలు లక్షల మందిని ప్రభావితం చేస్తాయి.
వారు మాట్లాడే మాటలు, వారి ఆలోచనలు వారి కార్యకర్తలను ,సామాన్య ప్రజలను చాలా ప్రభావితం చేస్తాయి
అందుకే నాయకులు ప్రతి మాట మాట్లాడేముందు ఆలోచించాలి, విచక్షణతో వ్యవహరించాలి
*విలువలతో కూడిన రాజకీయమే – ప్రజాస్వామ్యానికి బలమైన పునాది*
విమర్శలు వుండాలి – కానీ అవి నిజాలపై ఉండాలి.
వాదనలు కావాలి – కానీ అవి గౌరవంతో సాగాలి.
చర్చలు జరగాలి – కానీ అవి అసభ్య పదజాలానికి అతీతంగా ఉండాలి.
ఇలాంటివే ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెడతాయి.
మాటల కించపరిచేవిగా కాక – మార్గదర్శకాలుగా మారాలి
విమర్శలు అప్రజాస్వామికంగా కాక – ఉత్తమ పరిష్కారాలకై ఉండాలి
రాజకీయ నాయకులు వ్యక్తిగత విమర్శలపై కాక – ప్రజల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి
రాజకీయ వేదికలు తిట్ల పోటీకి కాదు మంచి ఆలోచనలకి అభివృద్ధి కి పోటీగా మారాలి
ఈ మార్పు ఎప్పటికైనా జరగాలి.
ఇప్పటికైనా రాజకీయ నాయకులు అత్మ విమర్శ చేసుకోవాలి.
ప్రజల శ్రేయస్సు కోసం విలువలతో కూడిన మార్గాన్ని ఎంచుకోవాలి.
*నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడు ఎప్పటికీ ప్రజలు మెచ్చే నాయకుడు కాలేడు*
జి. అజయ్ కుమార్
సామాజిక విశ్లేషకులు
C.E.O
Cell – 9866017966