*కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌళిక వసతుల కల్పన
*2 లక్షల 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు 344 కేంద్రాల ఏర్పాటు
*రబీ మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
*జననేత్రంన్యూస్ఉమ్మడిఖమ్మంజిల్లాబ్యూరోమార్చ్20*//:రబీ మార్కెటింగ్ సీజన్ లో ఖమ్మం జిల్లాలో రైతులు పండించిన ధాన్యం మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి 2024-25 రబీధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ గత ఖరీఫ్ సీజన్ లో ఖమ్మం జిల్లాలో విజయవంతంగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం రబీ సీజన్ కు సంబంధించి లక్షా 85 వేల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, 73 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, మొత్తం 2 లక్షల 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబోతున్నామని అన్నారు.
గత సీజన్ లో ధాన్యం రవాణా అంశంలో ఎక్కడైనా చిన్న, చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 344 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులకు అనుకూలంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఉండాలని కలెక్టర్ తెలిపారు.
ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. దాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జి, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందజేయాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు.
ప్రాథమిక అంచనా ప్రకారం ఏప్రిల్ రెండవ వారం నుంచి ధాన్యం కోతలు ప్రారంభమవు తాయని, జిల్లాలో వరి పంట కోతల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకుని వచ్చే షెడ్యూల్ పకడ్బందీగా తయారు చేయాలని, కొనుగోలులో ఎక్కడా ఒత్తిడి లేకుండా క్రమ పద్ధతిలో ధాన్యం తీసుకుని వచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు గ్రామాల వారీగా సన్న రకం ధాన్యం ధ్రువీకరణ చేసి కొనుగోలు కేంద్రం మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ అన్నారు.
జిల్లా సరిహద్దుల్లో అవసరమైన చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి మనకు సన్న రకం వడ్లు రాకుండా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌళిక వసతులు కల్పించాలని, ప్యాడీ క్లీనర్, వేయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు, మొదలగు వసతులు కల్పించాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్రాగు నీరు, విద్యుత్ సరఫరా, లైట్లు మొదలగు సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వేసవి దృష్ట్యా త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, చల్లని త్రాగు నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అవసరమైన మేర ఓఆర్ఎస్ ప్యాకేట్లు పెట్టుకోవాలని అన్నారు.
కొనుగోలు సమయంలో రైతులకు వడదెబ్బ తగిలే అవకాశాలను నివారించాలని అన్నారు. వడదెబ్బ తగిలితే వారికి ప్రాథమిక చికిత్స అందించే ఏర్పాటు చేయాలని అన్నారు. వేయింగ్, తేమ యంత్రాల పని తీరును చెక్ చేసి సర్టిఫై చేయాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్ని సంచులు, అకాల వర్షాల నుంచి పంట కాపాడేందుకు వీలుగా టార్ఫాలిన కవర్లు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. ప్రతి సెంటర్ వద్ద ఉన్న గన్ని బ్యాగుల వివరాలను నోటీసు బోర్డుపై రాయాలని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన హామాలీలు ఉండేలా చూడాలని అన్నారు.
ఈ సమావేశంలో డిఆర్డిఓ సన్యాసయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీం, జిల్లా సహకార అధికారి గంగాధర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966